కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, రాంజీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, జాతీయ విత్తన బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రామిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని గాంధీ పార్కు వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రామిక సంఘాల నాయకులు ఆర్.శ్రీనివాసులు, నర్సింహ, ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసే నాలుగు లేబర్ కోడ్సు తీసుకువచ్చి.. కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పెట్టుబడిదారులకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ, రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఆంజనేయులు, నర్సింహ, శ్రీనివాసులు, దేశ్యనాయక్, పర్వతాలు, రామయ్య, శివవర్మ, బాలస్వామి, పార్వతమ్మ, మాసమ్మ, జయమ్మ, లక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు.


