చదువుతోనే సమాజంలో మార్పు
నాగర్‌కర్నూల్: చదువుకుంటేనే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వైద్య. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన ఎంపీ మల్లు రవి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డితో కలిసితో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే నాగర్‌కర్నూల్ పట్టణంలోని 245 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.7.80 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. అనంతరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప న, ఉపాధ్యాయుల నియామకం, ఆధునిక సాంకేతికత విద్య తదితరవి అమలు చేస్తున్నామన్నారు. విద్యతోనే భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేయగలమని, అదే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. అలాగే ప్రతి పేద వాడి ఆరోగ్యాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నామని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో 109 ట్రామా కేంద్రాలు నిర్మించామని, వృద్ధ తల్లిదండ్రుల కోసం 37 ప్రణామ్ కేంద్రాలు స్థాపించామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక వైద్య పరిక రాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
విద్యార్థులకు సూచనలు
మంత్రి దామోదర రాజనర్సింహ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు.. ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై మంత్రి సూచనలు చేశారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయం సాధ్యమని పేర్కొన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాను విద్యా హబ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేక విద్యాసంస్థలను నెలకొల్పుందన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు.
విద్య, వైద్యానికే మా ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
జిల్లాకేంద్రంలో పలు అభివృద్ధి
పనులకు శంకుస్థాపన


