పులుల గణన శాసీ్త్రయంగా చేపట్టాలి
లింగాల/ మన్ననూర్/ కొల్లాపూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు, వన్యప్రాణుల గణన శాసీ్త్రయంగా చేపట్టాలని లింగాల, మన్ననూర్, కొల్లాపూర్ ఎఫ్‌ఆర్‌ఓలు ఈశ్వర్, వీరేశ్, మగ్దూం హుస్సేన్ అన్నారు. సోమవారం వారి పరిధిలోని సిబ్బందితో నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడారు. పులుల లెక్కింపు విధానం, భద్రతా చర్యలు, ఫీల్డ్ స్థాయిలో అమలు విధానాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం, అడుగుజాడలను గుర్తించి అటవీ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
సఫారీ మూసివేత
వన్యప్రాణుల గణన చేపడుతున్నందున మంగళవా రం నుంచి ఆదివారం జంగిల్ సఫారీ మూసివేస్తామని ఎఫ్‌ఆర్‌ఓ వీరేశ్ తెలిపారు. సఫారీ టోల్‌గేట్ ద్వారా వచ్చే ఆదాయం పారదర్శకంగా టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్‌కు మల్లించడం జరుగుతుందన్నారు. ఆదాయం పారదర్శకతను పెంచేందుకు చెక్‌పోస్టు నిర్వహణను పూర్తిగా డిజిటల్ విధానంలో అమలుపరుస్తూ ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అడవులు, వన్యప్రాణుల అభివృద్ధి, సంరక్షణ, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు, స్థానిక ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.


