అంతటా అంతేగా..!
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భావ సందర్భంలో వార్డుల్లో మార్పులు జరిగి డివిజన్లుగా ఏర్పడినప్పుడు డివిజన్ 15లో మొత్తం 3,403 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ముసాయిదా జాబితాలో 46, 47, 48 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,800 ఓటర్లు ఉన్నట్లు చూపించారు. ఇదే డివిజన్‌లో ఎక్కడో దూరంలో ఉన్న బండమీదిపల్లికి చెందిన 40, హైదరాబాద్ నగరంలో సైబరాబాద్‌కు చెందిన 20 మంది ఓటర్లు ఉండడం గమనార్హం. ఇదే డివిజన్ పరిధిలోని చిల్మర్‌కుచ్చతండాకు చెందిన 50 మంది ఓటర్లను ఏ సంబంధం లేని డివిజన్ 37లో కలిపారు.
నారాయణపేట జిల్లా కోస్గి మున్సి పాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 11వ వార్డుకు సంబంధించి ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 1,350 మంది ఓటర్లున్నారు. ఇందులో వికారాబాద్ జిల్లా దోమ మండలం జిన్నారంతండాకు చెందిన 20 మంది ఓటర్ల పేర్లు వచ్చాయి. ఇదే వార్డులో మెదక్ జిల్లా సూరారం ఓటర్ల పేర్లు.. కోస్గి మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన 18 మంది ఓటర్ల పేర్లు నమోదయ్యాయి.
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. 8వ వార్డులోని 200 పైచిలుకు ఓట్లు 9వ వార్డులోకి వెళ్లగా.. 10, 6, 7 వార్డుల్లోని ఓటర్ల పేర్లు తారుమారయ్యాయి. రెండో వార్డులో పలు తండాలకు చెందిన ఓటర్లు పేర్లు ఉన్నాయి.
జోగుళాంబ జిల్లాకేంద్రం గద్వాల పురపాలికలో 30వ వార్డు సుంకులమ్మ మెట్టు ప్రాంతంలోని సుమారు 400 ఓట్లను సమీపంలో ఉన్న 16వ వార్డులో కలిపారు. 1–3–75 నుంచి 1–3–90 నంబర్ వరకు ఉన్న ఇళ్లను 16వ వార్డులో కలిపినట్లు తెలుస్తోంది. ఇదే జిల్లా అయిజ మున్సిపాలిటీలోని పలు వార్డు ల్లో ఓట్లు వేరే వార్డుల్లో నమోదయ్యాయి.
వనపర్తి మున్సిపాలిటీలోని 4వ వార్డులో గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన ఓట్లు నమోదయ్యాయి.
తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో ఇతర జిల్లాల ఓటర్లు
● ఉమ్మడి పాలమూరులోని అన్ని పురపాలికల్లోనూ గందరగోళం
● ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 98
● అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వెల్లువ
మున్సిపాలిటీ వారు్‌ుడ్ల ఫిర్యాదులు
మ.నగర్ (కా) 60 98
భూత్పూర్ 10 20
దేవరకద్ర 12 03
నాగర్‌కర్నూల్ 24 51
కొల్లాపూర్ 19 05
కల్వకుర్తి 22 32
నారాయణపేట 24 –
మక్తల్ 16 07
కోస్గి 16 03
మద్దూర్ 16 03
గద్వాల 37 06
అలంపూర్ 10 –
అయిజ 20 06
వడ్డేపల్లి 10 01
వనపర్తి 33 18
కొత్తకోట 15 01
అమరచింత 10 –
ఆత్మకూర్ 10 06
పెబ్బేరు 12 31
మొత్తం 376 291
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల
కమిషన్ ఆదేశాల మేరకు వెల్లడించిన ఓటర్ల ముసాయిదా జాబితాలు గందరగోళం
సృష్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో జడ్చర్ల, అచ్చంపేట మినహా ఎన్నికలు
జరిగే మహబూబ్‌నగర్ కార్పొరేషన్.. మిగిలిన 18 మున్సిపాలిటీలు అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు నివ్వెరపరుస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతున్నాయి.
మొత్తం 291 ఫిర్యాదులు
ఉమ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రహసనంగా మారడం.. సర్దుబాటు చేయడంతో..
ప్రధానంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఆన్‌లైన్ నమోదులో..
బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు.
అంతటా అంతేగా..!


