నిర్వహణ భారం!
● 44 నెలలుగా రైతువేదికలకు అందని నిధులు
● ఇబ్బందులు పడుతున్న వ్యవసాయశాఖ అధికారులు
● తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏఈఓల పాట్లు
అచ్చంపేట: వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు అధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ రైతువేదికల నిర్వహణపై పట్టింపు లేకుండా పోయింది. ఏళ్ల తరబడి నిర్వహణ నిధులు మంజూరు చేయకపోవడంతో రైతువేదికల లక్ష్యం ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. మూడేళ్లకు పైగా బకాయిలు పేరుకుపోవడం ఏఈఓలకు భారంగా మారింది.
ఏళ్ల తరబడి..
జిల్లాలో కస్టర్ల వారీగా 142 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఐదు నెలల పాటు నెలకు రూ.9వేల చొప్పున గత ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. మే 2022 నుంచి ఇప్పటి వరకు 44 నెలలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తరణాధికారులు నెలనెలా ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతువేదికకు ప్రతినెలా రూ. 9వేల చొప్పున 44 నెలలకు గాను సుమారు రూ.3.96 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
అన్నింటి భారం ఏఈఓలపైనే..
రైతువేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. కనీసం మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం నిర్వహణ, కరెంటు బిల్లుల చెల్లింపు, స్వీపర్లకు జీతాల చెల్లింపు, రైతునేస్తం, రైతులతో సమావేశాల నిర్వహణ సమయంలో టీ, బిస్కెట్లు వంటి వాటికి నిధులు లేకపోవడంతో అన్నింటిని తామే భరించాల్సి వస్తుందని ఏఈఓలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రైతువేదికల్లో అటెండర్‌తో మొదలుకొని అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు రైతువేదికల్లో ఏర్పాటుచేసిన మినీ భూసార పరీక్షల నిర్వహణ కూడా అటకెక్కింది.
బల్మూర్ రైతువేదిక
పంట సాగు: 7.38 లక్షల ఎకరాలు
నిధులు రావడం లేదు..
జిల్లాలో రైతువేదికల నిర్వహణ కోసం గతంలో ప్రభుత్వం ఐదు నెలల పాటు నిధులు అందజేసింది. ప్రస్తుతం మూడు సంవత్సరాలకు పైగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం వాస్తవమే. విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ కష్టతరంగా ఉంది. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నాం. – యశ్వంత్‌రావు
జిల్లా వ్యవసాయశాఖ అధికారి


