మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదాం
అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదామని మాజీ మంత్రి, ఎంపీ పోతుగంటి రాములు పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోందన్నారు. బీహార్ రాష్ట్రంలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన తీర్పు తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, పేర్లు లేకపోవడం, వేరే వార్డుల్లో రావడంపై వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు నాగయ్య, వెంకట్‌శెట్టి, ఖలీల్, యువ మోర్చా నాయకులు చందు లాల్, శివ చంద్ర తదితరులు పాల్గొన్నారు.


