వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం
కందనూలు: ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అటల్ బిహారి వాజ్‌పేయి ప్రజలకు అందించిన సేవలు మరవలేనివని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు శాంతికుమార్ అన్నారు. వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాజ్‌పేయి హయాంలోనే ప్రోక్రాన్ అణుపరీక్షలు నిర్వహించి, ప్రపంచానికి భారతదేశం గొప్పతనాన్ని చాటిచెప్పారన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన్ ద్వారా ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించారని గుర్తుచేశారు. స్వర్ణ చతుర్బుజి ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హైవేలను విస్తరించిన ఘనత వాజ్‌పేయికే దక్కిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం పార్టీలకు అతీతంగా పనిచేసిన మహనీయుడు వాజ్‌పేయి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, అధికార ప్రతినిధి దిలీపాచారి తదితరులు పాల్గొన్నారు.


