ఆక్రమిస్తూ.. అద్దెకిస్తూ! | - | Sakshi
Sakshi News home page

ఆక్రమిస్తూ.. అద్దెకిస్తూ!

Dec 26 2025 9:55 AM | Updated on Dec 26 2025 9:55 AM

ఆక్రమ

ఆక్రమిస్తూ.. అద్దెకిస్తూ!

అచ్చంపేట: పట్టణాల్లో పుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నాయి. చిరువ్యాపారాల పేరిట కొందరు పుట్‌పాత్‌లను యథేచ్ఛగా ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వాటిని ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు. కొందరైతే ఏకంగా తమ అడ్డాలను అమ్మేస్తున్నారు. ఇలాంటి దందాలపై మున్సిపల్‌ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. రహదారులే అడ్డాగా ఆక్రమణలు పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా రోజురోజుకు ఈ తతంగం విస్తరిస్తోంది. నడిచేందుకు స్థలం లేక పాదచారులు నడిరోడ్డుపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

మొదట తాత్కాలికంగా ప్రారంభించి..

రహదారుల ఆక్రమణలు ఒకేసారి విస్తరించడం లేదు. మొదట తాత్కాలిక ఏర్పాట్లతో చిరువ్యాపారులను ప్రారంభించి.. ఆ తర్వాత వాటిని విస్తరిస్తున్నారు. ఒకరు దుకాణం ప్రారంభించగానే మరొకరు.. ఆపై ఇంకొకరు ఇలా ఆ ప్రాంతమంతా ఇలాంటి వ్యాపారులతో నిండిపోతుంది. ఇందులో కొన్ని సక్రమైతే.. చాలా వరకు అక్రమంగా వెలుస్తున్నావే. ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎవరి అనుమతి లేకుండా రూ.వేలల్లో సంపాదించే దందా జోరుగా సాగుతోంది. ప్రధాన రహదారి పక్కన ఖాళీ స్థలముంటే చాలు.. మెల్లగా కొన్ని రోజులు అక్కడ చిన్నపాటి దందా నడిపి.. ఆ స్థలాన్ని తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇక ఎవరూ తమ జోలికి రావడం లేదని నిశ్చయించుకున్న తర్వాత ఏకంగా అడ్డాలను అద్దెకు ఇస్తున్నారు. చిరువ్యాపారులే కదా అని అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో తొండ ముందిరి ఊసరివెల్లిగా మారిన పరిస్థితి ఏర్పడుతోంది.

అచ్చంపేటలో ఇదీ పరిస్థితి..

అచ్చంపేట పట్టణంలోని నాగర్‌కర్నూల్‌ – శ్రీశైలం ప్రధాన రహదారితో పాటు బస్టాండ్‌, రాజీవ్‌ చౌరస్తా, లింగాల రోడ్డు, పోస్టాఫీస్‌, ప్రభుత్వ ఆస్పత్రి, నెహ్రూ చౌరస్తా, ఉప్పునుంతల రోడ్డు తదితర ఏరియాల్లో దుకాణదారులు ఎక్కువగా తమ షాపు ఎదుట ఉన్న స్థలంలో చిరువ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు గాను చిరువ్యాపారుల నుంచి అద్దె వసూలు చేస్తున్నారు. చిరువ్యాపారుల నుంచి రోజువారీగా అద్దె వసూలు చేస్తూ.. నెలకు రూ.వేలల్లో సొమ్ము చేసుకుంటున్నారు. తమ దుకాణమే ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా ఉందంటే.. రహదారిని ఆక్రమించి మరో దుకాణాన్ని పెట్టేస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదు.

పోస్టాఫీస్‌కు వెళ్లడం కష్టమే..

లింగాల చౌరస్తాలో పోస్టాఫీస్‌ ఉంది. నిత్యం వందలాది మంది వినియోగదారులు, అధికారులు, ఉద్యోగులు వస్తుంటారు. పోస్టాఫీస్‌ ఎదుట, పక్కనున్న ప్రధాన రహదారిని యథేచ్ఛగా ఆక్రమించి చిరువ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. కనీసం కార్యాలయంలోకి వెళ్లేందుకు దారి కూడా లేకుండా చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడ ఉన్న డబ్బాలను తొలగించి వాహన పార్కింగ్‌ ఏర్పాటు చేయగా.. కొద్ది రోజులకే చిరువ్యాపారాలు వెలియడంతో పరిస్థితి యథావిధిగా మారింది. ఆక్రమణదారులకు అధికార పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి లింగాలకు వెళ్లే రోడ్డుపై కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉప్పునుంతల రోడ్డు మలుపు వద్ద ఇరువైపులా చిరు వ్యాపారులు అడ్డాలను ఏర్పాటు చేసుకోవడంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఉంది.

వెండింగ్‌ జోన్లు లేకపోవడంతో

జిల్లాలో నాగర్‌కర్నూల్‌ మినహా ప్రత్యేకంగా వెండింగ్‌ జోన్లు లేకపోవడంతో చిరువ్యాపారులకు పుట్‌పాత్‌లే దిక్కువుతున్నాయి. అచ్చంపేటలో సమీకృత మార్కెట్‌ సమూదాయం నిర్మించి పుట్‌పాత్‌ వ్యాపారులకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. రోడ్లపైనే చిరువ్యాపారాలు నిర్వహిస్తూ బతుకు వెల్లదీస్తున్న వారికి ప్రత్యేకంగా వెండింగ్‌ జోన్లు ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు.

పట్టణాల్లో యథేచ్ఛగాపుట్‌పాత్‌ల ఆక్రమణ

చిరువ్యాపారులకు అద్దెకిస్తున్నదుకాణదారులు?

చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

ఆక్రమిస్తూ.. అద్దెకిస్తూ! 1
1/1

ఆక్రమిస్తూ.. అద్దెకిస్తూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement