గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరం 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలతో ఇంటర్ వరకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో సహజసిద్ధమైన ప్రతిభ ను వెలికితీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి సుమారు రూ. 1.70 లక్షలు ఖర్చుచేసి, గురుకులాలను నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆసక్తిగల, అర్హులైన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా అర్హులైన విద్యార్థులు www.tgcet.cgg.gov.in, https://tgs wreis.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గురుకులాల్లో చేరదల్చిన బాలబాలికల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


