భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను గురువారం క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. సుందరంగా ముస్తాబుచేసిన చర్చిల్లో యేసయ్య రాకను స్వాగతిస్తూ.. సుమధుర సుస్వరాల గీతాలాపనలతో ఆరాధించారు. క్రీస్తు మహిమలను పాటల ద్వారా కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. క్రైస్తవులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఏసు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముఖ్య ప్రసంగీకుడిగా రెవరెండ్ మోజస్ హాజరై.. విశ్వమానవాళి శ్రేయస్సు కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న చర్చిలో తాను వాక్యోపదేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రభువైన ఏసుక్రీస్తు పుట్టుక చరిత్రను సృష్టించిందని.. ఈ విశ్వాన్ని కదిలించిందన్నారు. ప్రభువైన ఏసుక్రీస్తు దేవాది దేవుడికి, మానవాళికి మధ్యవర్తి అని అన్నారు. కాగా, క్రైస్తవులు ఉదయాన్నే చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, ఎంబీ చర్చి చైర్మన్ సంపత్‌కుమార్, కార్యదర్శి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


