ప్రతి పనికి జియో ట్యాగింగ్..
సాక్షి, నాగర్‌కర్నూల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. వీటిపై కూలీలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం వీబీజీ రాంజీ (వికసిత భారత్– గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్)గా మార్చడంతో పాటు ఇటీవల చట్టంగా అమలులోకి తెచ్చింది. దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా గ్రామసభలను నిర్వహించనున్నారు. ఈ పథకం ద్వారా చేపట్టే పనులను ప్రజలకు వివరించనున్నారు. వారం రోజుల వ్యవధిలోనే గ్రామసభలను పూర్తిచేసి.. ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకోనున్నారు.
పనిదినాల పెంపు..
గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 100 రోజుల వరకు పని కల్పించేందుకు గ్యారంటీ ఉండగా.. ఇప్పుడు కేంద్రం ఈ పరిమితిని 125 రోజులకు పెంచింది. గతంలో ఇందుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించగా.. ఇకనుంచి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించాల్సి ఉంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి 15 రోజుల్లోగా పని లభించకపోతే.. రోజూవారీ నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు వీలు కల్పించారు. జిల్లాలోని 360 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని అమలుచేస్తుండగా.. మొత్తం 3,74,896 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరిలో వేసవి కాలంలో అత్యధికంగా 55,499 మంది వరకు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు.
మట్టి పనులకు మంగళం..
ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం.. మట్టి పనులను పూర్తిగా తొలగించింది. ఈ పనులను ఎంపిక చేయొద్దని గతేడాది నుంచే ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో ఎక్కువగా చెరువుల్లో పూడిక తీత, కందకాలు తవ్వడం వంటి పనులను చేపట్టేవారు. అయితే వీటిలో ఆశించినంత పని జరగలేదన్న అభిప్రాయం నెలకొంది. తాజాగా మారిన నిబంధనల మేరకు ఇకపై జలసంరక్షణ పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చెరువులు, కుంటల స్థిరీకరణ, భూగర్భ జలాలు పెంచే వాటర్ షెడ్లు, కాల్వల నిర్మాణం, నీటిబావుల తవ్వకం వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను చేపడుతుండగా.. ఇకపై కొనసాగించనున్నారు. అదే విధంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలంలో సుమారు 2నెలల పాటు ఈ పథకం పనులను నిలిపివేయనున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు కూలీల కొరత తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టనున్నారు.
కార్యాచరణ సిద్ధం..
గతంలో ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనిదినాలు ఉండగా.. ఇకపై 125 రోజుల పాటు పని కల్పించనున్నాం. జలసంరక్షణ, నీటి వనరుల అభివృద్ధికి సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఉంటుంది. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.
– చిన్నబాలు, డీఆర్డీఓ
జలసంరక్షణకు ప్రాధాన్యం..
ఇకపై చేపట్టే పనుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించనున్నారు. గ్రామాల్లో తాగు, సాగునీటి వనరులను మెరుగుపర్చుకునేందుకు ఈ పథకం ద్వారా పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, నీటి వసతి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మంచినీటి పైప్‌లైన్లు, సాగునీటి కాల్వలు, పొలాల్లో పిల్లకాల్వల తవ్వకాలను చేపట్టేందుకు వీలుకలుగనుంది.
గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు పనులకు సంబంధించిన ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి ఉపాధి హామీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లాలోని 360 గ్రామ పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
వీబీజీ రాంజీ పేరుతో పథకం అమలు
100 నుంచి 125 రోజులకు పనిదినాల పెంపు
రైతులకు కూలీల కొరత
తలెత్తకుండా వెసులుబాటు
ప్రతి పనికి జియో ట్యాగింగ్..


