పెద్దపులి జాడ కోసం విస్తృతంగా అన్వేషణ
కొల్లాపూర్ రూరల్: కృష్ణానది పరిసర అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి జాడ కోసం గురువారం తెలంగాణ అటవీశాఖ కొల్లాపూర్ రేంజ్, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆత్మకూర్ రేంజ్ అధికారులు సంయుక్తంగా సరిహద్దు పెట్రోలింగ్ నిర్వహించారు. పెద్ద పులి అడుగు జాడల కోసం విస్తృతంగా అన్వేషణ చేపట్టారు. పులి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ.. నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెద్ద పులితో ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సోమశిల, అమరగిరి గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. రాత్రివేళలో ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని.. ఏమైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కొల్లాపూర్ రేంజ్ అధికారి మగ్దూంహుస్సేన్, సెక్షన్ అధికారులు ముజీబ్ ఘోరి, బయన్న, నీలేష్, ఆత్మకూర్ డివిజన్ అధికారులు మద్దిలేటి, కావేరి, నవీన్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.


