
యూరియా కొరత సృష్టిస్తే సహించం
ఉప్పునుంతల: ఎరువుల డీలర్లు యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడి.. కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. శనివారం ఉప్పునుంతలలోని ఆగ్రో రైతు సేవాకేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యారియాకు సంబంధించిన స్టాక్ రికార్డులను పరిశీలించారు. రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న విధానంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. రైతులు తమ అవసరం మేరకు మాత్రమే యూరియాను తీసుకెళ్లాలని సూచించారు. ఎరువుల వాడకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీలో కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. పీహెచ్‌సీలో మందుల నిల్వలు, వార్డుల శుభ్రత, పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.