నాగర్‌కర్నూల్ క్రైం: బాలికలను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోక్సో చట్టంపై పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. పోక్సో చట్టం బాలికలకు రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు. ఈ చట్టం కింద కేసు నమోదు అయితే, సదరు వ్యక్తి కఠినంగా శిక్షించబడటంతో పాటు జైలుశిక్ష అనుభవిస్తాడన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన కల్పించి.. బాలికలపై లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. వచ్చేనెలలో నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా పోలీసులు, న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా, సీనియర్ సివిల్‌జడ్జి వెంకట్రామ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి శృతిదూత పాల్గొన్నారు.