
‘తాత్కాలికంగా వంతెన నిర్మిస్తాం’
లింగాల: మండల కేంద్రం సమీపంలో అప్పాయపల్లి వెళ్లే మార్గంలో ఉన్న చిన్నవాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచి పోవడంతో వర్షాలు కురిసిన సమయంలో వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్‌అండ్‌బీ డీఈ జలంధర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రంగినేని శ్రీనివాస్‌రావు పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణం కోసం గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.80 లక్షలు కేటాయించింది. అప్పట్లో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిపివేశారు. వర్షాలకు వాగు ప్రవాహం అధికంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోవడంతో విషయాన్ని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాగా తాత్కాలికంగా వంతెన పక్క నుంచి సిమెంట్ పైపులు వేయించి రాకపోకలకు ఆటంకం కలుగకుండా చూస్తామని డీఓ తెలిపారు. నిధులు విడుదలయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.
ప్రజలకు అందుబాటులో
ఉండాలి: డీఎంహెచ్‌ఓ
తెలకపల్లి: కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్ సూచించారు. మండలంలోని బొప్పల్లి, పెద్దూరు ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. గర్భిణులకు 5వ నెలలోనే ప్రణాళిక తయారు చేయడంతో పాటు సాధారణ కాన్పులు చేయాలన్నారు. కాన్పు సమయంలో గర్భిణులకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే గుర్తించి జిల్లా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, డెంగ్యూ జ్వరాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులకు ఆదేశించారు.

‘తాత్కాలికంగా వంతెన నిర్మిస్తాం’