
గణపతి ఉత్సవాల్లో డీజేలపై నిషేధం
అచ్చంపేట రూరల్: గణపతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గంలోని అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర మండలాలకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులతో అచ్చంపేట ఎస్‌ఐ విజయభాస్కర్ అధ్యక్షతన శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గణపతి ఉత్సవాల్లో డీజేలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి డీజేలు తీసుకొస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. గణపతి మండపాలకు పోలీసు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. యువత భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. నిమజ్జనం ర్యాలీలో పాల్గొనే వాహనాలకు ఫిటెనెస్ ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, సీఐ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఎస్‌ఐలు విజయభాస్కర్, పవన్‌కుమార్, ఫైర్ ఆఫీసర్ శంకర్, విద్యుత్‌శాఖ అధికారులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.