
శిశు సంజీవని సేవలు వినియోగించుకోవాలి
అచ్చంపేట రూరల్: జిల్లాలో ఉన్న శిశు సంజీవని కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ కోరారు. బుధవారం పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలోని శిశు సంజీవని ఎస్‌ఎన్‌సీయూ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. శిశువులకు వెంటనే టీకాలు వేయించాలని చిన్నపిల్లల వైద్య నిపుణులకు సూచించారు. శిశు సంజీవనిలో తక్కువ బరువుత, అవయవ లోపాలతో పుట్టిన చిన్నారులకు, పసిరికలు తదితర అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నడింపల్లి, చందాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పల్లె దవాఖానా డాక్టర్లు ప్రతిరోజు ఓపీ సేవలు అందించాలని, క్రమం తప్పకుండా అధిక రక్తపోటు, మధుమేహ రోగులను పరీక్షించి మందులు వాడేటట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ అంటు వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.