
జల విలయం
సాక్షి, నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ క్రైం/ బిజినేపల్లి: జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సోమవారం పెద్దకొత్తపల్లి మండలంలో అత్యధికంగా 96.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని లింగాల, బిజినేపల్లి, తాడూరు, బల్మూరు, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, ఉప్పునుంతల మండలాల్లో 55 మి.మీటర్లకు మించి వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. చారకొండ మండలంలో అత్యల్పంగా 25.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల చెరువులు మత్తడి దూకుతూ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని సిర్సవాడ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ వాగుతో పాటు జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం మత్తడి ప్రవాహాన్ని కలెక్టర్ సంతోష్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాకేంద్రం నుంచి కేసరిసముద్రం మీదుగా ఎండబెట్ల వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఉప్పొంగుతున్న వాగులు, చెరువుల ప్రవాహాల మీదుగా దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
అధికార యంత్రాంగం హైఅలర్ట్
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్ట నివారణకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వరదలు, ముంపు ప్రాంతాల బాధితుల సంరక్షణ, సహాయం కోసం ఇప్పటికే ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు నేరుగా 08540–230201 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
నిలిచిన రాకపోకలు
జిల్లాలో దుందుభీ వాగు ప్రవాహం ఉధృతంగా మారడం, పలుచోట్ల చెరువులు మత్తడి దూకి రహదారుల మీదుగా ఉప్పొంగుతుండటంతో గ్రామాల మధ్య రాకపోకలకు ఆటకం ఏర్పడుతోంది. జిల్లాకేంద్రంలోని కేసరిసముద్రం చెరువు ఉప్పొంగి నాగర్‌కర్నూల్–ఎండబెట్ల రోడ్డు మీదుగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తాడూరు మండలంలోని సిర్సవాడ వద్ద దుందుభీ ప్రవాహం ఉధృతం కావడంతో అధికారులు ఈ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. ప్రజలు ఎవరూ ఈ మార్గంలో వెళ్లకుండా నిరంతరం పహారా ఏర్పాటుచేశారు.
పలుచోట్ల కుండపోత
జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు. జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయంగా మారాయి.
పాత ఇళ్లతో ప్రమాదం
భారీ వర్షాలకు జిల్లాలోని అమ్రాబాద్ మండలం జంగిరెడిపల్లిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. గ్రామానికి చెందిన మద్దెల అర్జనమ్మ, మంతటి నారమ్మ, కల్వల లక్ష్మమ్మకు చెందిన పాత ఇళ్ల పైకప్పు వర్షానికి తడిసి సోమవారం నేలకూలాయి. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శిథిలమైన, పాత ఇళ్లలో ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు వాగులు దాటేందుకు ఎవరూ ప్రయత్నించొద్దని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువును పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రమాదకర స్థితిలో పారుతున్న వాగుల్లో ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, అలాంటి ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
బిజినేపల్లి మండల కేంద్రం నుంచి నందివడ్డెమాన్ గ్రామానికి వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం వారు నందివడ్డెమాన్ గ్రామానికి వెళ్లే క్రమంలో రోడ్డుపై ప్రవహిస్తున్న భీమసముద్రం అలుగు ఉధృతికి ద్విచక్ర వాహనం కొద్ది దూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అతి కష్టం మీద నీటి ఉధృతి తక్కువ ఉన్న ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని తిరిగి లాక్కొచ్చారు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పెద్దకొత్తపల్లి మండలంలో అత్యధికంగా 96.4 మి.మీ. వర్షపాతం
చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
పొంగిపొర్లుతున్న వాగుల రహదారులపై రాకపోకలు సాగించొద్దని కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ విజ్ఞప్తి

జల విలయం