
ప్రజావాణికి గైర్హాజరైతే చర్యలు తప్పవు
నాగర్‌కర్నూల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కా ర్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, గైర్హాజరైతే చర్యలు తప్ప వని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించొద్దని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి జి ల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 30 వినతులు అందగా.. వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు కేటాయించారు.
ఐటీఐతో బంగారు భవిష్యత్
జిల్లాలోని కల్వకుర్తి, మన్ననూర్‌లో ఉన్న ఐటీఐ (ఏ.టీ.సీ) అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలను పెంచేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. ఐటీఐలో ఖాళీల భర్తీ కోసం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు, కల్వకుర్తి పట్టణంలోని ఐటీఐ కళాకాలల్లో 2025–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐటీఐలు టెక్నాలజీ హబ్‌లుగా మారిపోయాయని, అత్యాధునిక మౌలిక వసతులు, ప్రపంచ స్థాయి ల్యాబ్‌లు, టాటా టెక్నాలజీస్ సహకారం, ప్రముఖ ఇండస్ట్రీల భాగస్వామ్యంతో యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉండే విద్యార్థులను గుర్తించి, ఐటీఐలో చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా టీజీఏటీఈ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్, జిల్లా కన్వీనర్ మన్ననూర్ ఐటీఐ ప్రిన్సిపల్ ఎస్‌పీ లక్ష్మణ్‌స్వామి, ఐటీఐ కల్వకుర్తి ప్రిన్సిపల్ జి.జయమ్మ, జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.రాఘవేంద్రసింగ్, జిల్లా కార్మిక శాఖ అధికారి జె.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.