
చెంచులకు న్యాయ సహాయం అందిస్తాం
కొల్లాపూర్ రూరల్: చెంచులకు అన్ని విధాల న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ నాగర్‌కర్నూల్ సెక్రెటరీ నసీం సుల్తానా అన్నారు. హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని అమరగిరి గ్రామాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా చెంచుల యొక్క జీవన స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేని వారికి తమ సంస్థ తరుఫున ప్రభుత్వ న్యాయవాదిని నియమించి, న్యాయ సహయం అందిస్తామన్నారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలని తెలిపారు. బాల్య వివాహలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో ఉన్న విశ్వశాంతి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధుల యోగ క్షేమాలను తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవా, మండల న్యాయ సేవా సంస్థ చేదోడు వాడోడుగా ఆశ్రమానికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల నాగరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.