
‘ప్రకృతి ఒడిలో పాలధార’
అచ్చంపేట రూరల్: ప్రకృతి ఒడిలో అలరారుతున్న శ్రీశైలేషుడి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరుడి క్షేత్రంలో పాపనాశిని గుండం కొండపై నుంచి జాలు వారే జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కొన్ని రోజులుగా నల్లమల్ల పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియల నుంచి వచ్చే జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. చల్లని వర్షపు నీటిలో తడిసి ముద్దవుతున్నారు. అక్కడే సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పైనుంచి కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు.