
నులిపురుగుల నివారణతోనే మెరుగైన ఆరోగ్యం
అచ్చంపేట: చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే నులిపురుగులను నిర్మూలించడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. 1నుంచి 19ఏళ్లలోపు చిన్నారులు, యువతలో నులిపురుగుల కారణంగా ఎదుగుదల మందగించడం, నీరసం, రక్తహీనత, చదువులో ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలతో బాధపడతారన్నారు. వీటిని నివారించేందుకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. అపరిశుభ్రత వల్లే నులిపురుగులు సంక్రమిస్తాయని.. వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో 2,03,259 మందికి ఆల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలు వేయనున్నట్లు చెప్పారు. అనంతరం గురుకులంలో వంటశాల, నిత్యవసర వస్తువులు కూరగాయల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఆహారం నాణ్యత, వసతి సౌకర్యాలపై విద్యార్థులతో ఆరా తీశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బియ్యం, ఇతర వస్తువులు భద్రపరచడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.తారాసింగ్, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
తెగిన కేఎల్‌ఐ
పాటుకాల్వ
కోడేరు: మండల కేంద్రంలోని పిల్లిగుట్ట సమీపంలో ఉన్న కేఎల్‌ఐ మైనర్–3 కాల్వ సోమవారం కోతకు గురైంది. ఈ కాల్వ కింద దాదాపు 70ఎకరాల ఆయకట్టు ఉంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాల్వ తెగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు కాల్వకు సాగునీటి విడుదలను నిలిపివేశారు. వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతు చేయించి రైతులకు సాగునీరు అందిస్తామని ఏఈ లక్ష్మి తెలిపారు.

నులిపురుగుల నివారణతోనే మెరుగైన ఆరోగ్యం