
‘నులి’మేద్దాం..
అచ్చంపేట: కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో నులిపురుగులను నివారించడమే లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రతి ఏటా ఆగస్టు 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం చేపడుతోంది. ఈ మేరకు సోమవారం జిల్లావ్యాప్తంగా 1నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు.
పక్కా ప్రణాళిక..
జిల్లావ్యాప్తంగా 1నుంచి 19ఏళ్లలోపు వారు 2,03,252 మంది ఉన్నారు. వీరిలో 1,131 అంగన్‌వాడీ కేంద్రాల్లో 46,444 మంది చిన్నారులు, 1,147 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో 1,56,808 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. గతంలో ఏటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేవారు. 2020లో కరోనా మహమ్మారి తర్వాత ఆగస్టులో మాత్రమే ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో గుర్తించిన పిల్లందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలతో పాటు మిగిలిన వారికి ఈ నెల 18న మాత్రలు వేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
తప్పనిసరి వేయించాలి..
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో 1నుంచి 19ఏళ్లలోపు వారందరికీ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేయించాలి. మాత్రల పంపిణీ కార్యక్రమంలో 861మంది ఆశావర్కర్లు, 299మంది ఏఎన్‌ఎంలు, 81మంది సూపర్‌వైజర్లతో పాటు అంగన్‌వాడీ టీచర్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 1,150 మంది పాల్గొననున్నారు.
– రవినాయక్, డీఎంహెచ్‌ఓ
సమస్యలు.. జాగ్రత్తలు
నులిపురుగులతో బాధపడేవారు ప్రధానంగా ఎనిమియా (రక్తహీనత) వ్యాధి బారినపడతారు. అనారోగ్యంతో నీరసించిపోతారు. శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆకలి మందగించి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. మలవిసర్జన ప్రదేశంలో, చర్మంపై దురదలు వస్తుంటాయి. కొందరు పిల్లల్లో దీర్ఘకాలం పాటు ఇవి ఉన్నప్పటికీ వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ, ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రకాల ఎదుగుదలపై ప్రభావితం చూపుతాయి. నులిపురుగుల ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మలవిసర్జన, బహిర్భూమికి వెళ్లివచ్చాక కాళ్లు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలకు బూట్లు తప్పనిసరిగా ధరించాలి. దీంతో పాటు ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల నులిపురుగులు రాకుండా నియంత్రించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు, యువకులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో సంక్రమణాన్ని నియంత్రించడంతోపాటు శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని సూచిస్తున్నారు. అయితే రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర, 3–19 ఏళ్ల వారికి ఒక మాత్ర వేయాలని వైద్యులు చెబుతున్నారు. మాత్రలు వేసే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. వైద్యసిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే వేయాలని సూచిస్తున్నారు.
నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
1నుంచి 19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
జిల్లాలో 2,03,252 మందికి మాత్రలు వేసేందుకు ప్రణాళిక