
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజారోగ్యానికి భరోసా
అచ్చంపేట: నల్లమల ప్రాంతంలో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకే మెగా హెల్త్, సర్జికల్ క్యాంపు ఏర్పాటుచేసినట్లు ఎమ్మెల్యే డా.చిక్కడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అచ్చంపేట ఏరియా అస్పత్రిలో మూడో విడత మెగా హెల్త్, సర్జికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అచ్చంపేటలో మెగా సర్జికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్యాంపులో 570మంది పేర్లు నమోదు చేసుకున్నారని.. వీరందరికీ విడతల వారీగా సర్జరీలు చేస్తామన్నారు. ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల వసతులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ అవసరమైన క్యాడర్ స్టెంత్, బ్లడ్‌బ్యాంక్, సెంట్రల్ ఆక్సిజన్, పారా మెడికల్ సిబ్బంది, డాక్టర్లను నియమిస్తామన్నారు. గత రెండు విడతల్లో ప్రభుత్వ పరంగా మెడికల్ సర్జికల్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించి.. ఎంతో మంది రోగులకు శాశ్వత చికిత్సలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవినాయక్, సూపరింటెండెంట్ ప్రభు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.తారాసింగ్ ఆర్‌ఎంఓ ప్రదీప్‌రాజ్, డా.మహేశ్, డా.పగడాల శ్రీనివాస్, డా.బిక్కులాల్ పాల్గొన్నారు.