
కేఎల్‌ఐ కాల్వకు గండి
వెల్దండ: మండలంలోని లక్ష్మాపూర్ చెరువు కట్ట సమీపంలో ఉన్న కేఎల్‌ఐ డీ–82 కాల్వకు ఆదివారం గండి పడింది. రెండు రోజుల క్రితం కేఎల్‌ఐ కాల్వ ద్వారా వెల్దండ శివారు వరకు సాగునీరు చేరింది. అయితే కాల్వలో నీటి ప్రవాహం అధికం కావడంతో కోతకు గురై నీరంతా వృథాగా పారింది. కేఎల్‌ఐ నుంచి సాగునీరు వచ్చే సమయంలో కాల్వకు గండి పడటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి ఏటా డీ–82 కాల్వ కోతకు గురవుతుండటంతో సాగునీటి కోసం కష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. గతేడాది పంటలకు సకాలంలో నీరందక ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలకు సరైన మరమ్మతులు లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని అంటున్నారు. బ్రిడ్జిల వద్ద కాల్వకు లైనింగ్ నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.
రామన్‌పాడుకు
కొనసాగుతున్న వరద
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయానికి ఆదివారం శంకరసమ్రుదం నుంచి 1,500 క్యూసెక్కులు, ఊకచెట్టు వాగు నుంచి 300 క్యూసెక్కుల వరద చేరుతున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. దీంతో రెండు గేట్లు పైకెత్తి 1,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 75 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.