
ఆస్పత్రుల్లో ఆధార్ ఆధారిత హాజరు
●
బయోమెట్రిక్ విధానానికి స్వస్తి
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం స్థానంలో ఆధార్ ఆధారిత హాజరు అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. వైద్యులు, సిబ్బంది విధిగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు.
– శివరాం, సూపరింటెండెంట్,
కల్వకుర్తి సీహెచ్‌సీ
● వైద్యులు, సిబ్బంది పనితీరు
మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు
● ఈ నెల నుంచి నూతన
హాజరు విధానం అమలు
కల్వకుర్తి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆధార్ ఆధారిత హాజరు విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరును నిత్యం పర్యవేక్షించేందుకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమలుచేసేది. అయితే కొన్నిచోట్ల వైద్యుల హాజరు నమోదులో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడం.. ఇదే సాకుతో కొందరు వైద్యులు, సిబ్బంది విధులకు గైర్హాజరు కావడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటిని అధిగమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానానికి స్వస్తి పలికి.. ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
పారదర్శకత లేకపోవడంతో..
బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్యులు సమయానికి ఆస్పత్రికి వచ్చి హాజరు నమోదు చేసుకొని.. ఆ తర్వాత కొందరు వైద్యులు వ్యక్తిగత పనులపై బయటికి వెళ్లిపోవడం.. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి తీరిక దొరికిన సమయంలో ప్రభుత్వ ఆస్పత్రికి రావడం వంటివి జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల బయోమెట్రిక్ యంత్రం చెడిపోయేలా చేయడం.. అసలు మిషన్ పనిచేయకుండా చేసిన ఘటనలు ఉన్నాయి. బయోమెట్రిక్ యంత్రం మరమ్మతుకు నోచుకోకపోవడం ద్వారా సాధారణ పద్ధతిలో హాజరు వేసేందుకు వీలుండటంతో అధికారులు కూడా పట్టించుకునే వారు కాదు. వాటిని మరమ్మతు చేయించకుండా తాత్సారం చేసే వారు. దీంతో ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రులను నడుపుకొనేందుకు వీలుపడింది. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఈ నెల నుంచి ఆధార్ ఆధారిత హాజరును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే జిల్లాలోని కొన్ని ఆస్పత్రుల్లో ఒకటో తేదీ నుంచే ఈ విధానం అమలులోకి రాగా.. మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఆధార్ ఆధారిత హాజరు అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.
అన్ని ఆస్పత్రుల్లో..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధార్ ఆధారిత హాజరు విధానం అమలు చేయనున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, ఉప్పునుంతలలో సీహెచ్‌సీలు ఉండగా.. 20 మండలాలల్లో పీహెచ్‌సీలు ఉన్నాయి. చాలా వరకు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలలో పలు విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులు విధుల్లో చేరకుండా తాత్సారం చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.