
విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు
అచ్చంపేట రూరల్: నల్లమల ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను ప్రభు త్వం కల్పిస్తుందన్నారు. ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని.. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.
లెదర్ పార్క్
ఏర్పాటు చేయాలి : సీపీఐ
కల్వకుర్తిరూరల్: తెలకపల్లి మండలం జిన్‌కుంటలో లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిన్‌కుంటలో లెదర్ పార్క్ కోసం 23 ఎకరాలు కేటాయించినప్పటికీ.. ఫలితం లేకుండా పోతుందన్నారు. లెదర్‌పార్క్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టడంతో పాటు రుకారం చెరువును పునరుద్ధరించాలన్నారు. పాలెం సమీపంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. మత్స్య సంపద నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలన్నారు. కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లో విస్తారంగా సాగుచేసిన మామిడికి దళారుల బెడద నివారించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో విద్యాభివృద్ధి కోసం నియోజకవర్గానికి ఒక ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. కేఎల్‌ఐ ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని పెంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంతో పాటు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో కేశవులుగౌడ్, నర్సింహ, పరుశరాములు, శ్రీనివాసులు, ఫయాజ్, యూసూప్, దార దాసు ఉన్నారు.
కోయిల్‌సాగర్‌లో
నిలకడగా నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్‌లో గడిచిన వారం నుంచి నీటిమట్టం నిలకడగా ఉంది. జూరాల ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీటితో సమానంగా ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తుండటంతో హెచ్చుతగ్గులు లేకుండాపోతోంది. గత నెల 15 నుంచి వానాకాలం పంటలకు నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం వరకు 26 అడుగుల నీటిమట్టం ఉంది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతలలో భాగంగా జూరాల సమీపంలోని ఉంద్యాల ఫేస్–1 పంప్‌హౌస్ నుంచి ఒక పంపును రన్ చేసి 315 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులు ఉన్న నీటిమట్టం 15 అడుగులు పెరిగింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 0.6 అడుగుల నీరు చేరాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లెవల్ 32.6 అడుగులు ఉండగా మరో 6.6 అడుగుల నీరు చేరితే పూర్తిగా నిండుతుంది.

విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు