
పారదర్శకంగా ఉపాధ్యాయ పదోన్నతులు
కందనూలు: జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ రమేశ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సీనియార్టీ జాబితా మేరకు జిల్లాలో 39మంది జీహెచ్‌ఎంలుగా, 109 మంది స్కూల్ అసిస్టెంట్లుగా, 22 మంది పీఎస్ హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందనున్నారని తెలిపారు. ముందుగా 36 జిల్లా పరిషత్, 3 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న జీహెచ్‌ఎంల పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించేందుకు గాను సీనియార్టీ జాబితాను ప్రాంతీయ విద్యా సంచాలకులకు పంపించామని.. వారి పదోన్నతుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని డీఈఓ వివరించారు. ఇక అర్హులైన ఎస్జీటీల సీనియార్టీ జాబితా ప్రకారం 138 మంది ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా పదోన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు. లోకల్ బాడీ పాఠశాలల్లో ఖాళీల వారీగా హెచ్‌ఎంగా (ఎల్‌ఎఫ్‌ఎల్) 22మంది, గణితంలో 11మంది, భౌతిక శాస్త్రంలో ఇద్దరు, జీవశాస్త్రంలో 16మంది, సాంఘిక శాస్త్రంలో 25 మంది, హిందీలో 10 మంది, తెలుగులో 8 మంది, ఇంగ్లిష్‌లో 8 మంది, ఫిజికల్ డైరెక్టర్‌గా ఒకరికి, లోకల్ బాడీ ఉర్దూ మీడియం గణితంలో ఒకరికి, బయోసైన్స్‌లో ఒకరికి, సోషల్‌లో ఇద్దరికి, ఉర్దూ లాంగ్వేజ్‌లో ముగ్గురికి, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 15 మందికి పదోన్నతులు లభించనున్నాయని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో గణితం సబ్జెక్టులో ఒకరికి, ఫిజికల్ సైన్స్‌లో ఇద్దరికి, బయో సైన్స్‌లో ఒకరికి, ఇంగ్లిష్‌లో ఇద్దరికి, సోషల్‌లో ఒకరికి పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం పదోన్నతుల ప్రక్రియను సజావుగా పూర్తిచేసేందుకు సీనియర్ హెచ్‌ఎంలు, ఎంఈఓలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయ సీనియార్టీ జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని.. మంగళవారం సబ్జెక్టుల వారీగా పాఠశాలల ఖాళీల వివరాలతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతుల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు డీఈఓ తెలిపారు.