
ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి కృషి
మన్ననూర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరా సౌర గిరి జల వికాస పథకం రూపకల్పన కోసం పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లోని అటవీశాఖ జిల్లా కార్యాలయంలో ఎస్పీ వైభవ్ గ్వైకాండ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ప్రారంభించనున్న ఇందిరా సౌర గిరి జల వికాస పథకం కోసం చేపట్టాల్సిన అంశాల గురించి అధికారులకు వివరించారు. జిల్లా పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో నివశిస్తున్న ఆదివాసీ చెంచులను వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉందన్నారు. ఈ క్రమంలో మన్ననూర్‌లో చేపట్టనున్న ఈ పథకానికి రూ.12,600 కోట్ల నిధులు కేటాయిస్తూ 6 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తింపజేస్తుందని, దీంతో జిల్లాలోని 2.10 లక్షల మంది ఆదివాసీ చెంచు రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌తోపాటు చెంచుల వ్యవసాయ భూములకు సౌర శక్తితో నీటి సౌకర్యం, డ్రిప్ సిస్టం తదితర సౌకర్యాలు కల్పించి ఉద్యాన వన పంటలు సాగు చేయడంతోపాటు దిగుమతులను నేరుగా హైదరాబాద్ మార్కెట్‌కు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా చెంచుల భూములలో భూగర్భ జల అధికారులు తమ బృందాలతో సర్వే జరిపించి బోరు బావులకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అనంతరం సీఎం పర్యటనలో భాగంగా మన్ననూర్‌లోని పీటీజీ పాఠశాలలో హెలీప్యాడ్, అదేవిధంగా మాచారంలో సీఎం పాల్గొనే సభా స్థలంతోపాటు చెంచులకు సంబంధించిన పోడు భూములను వారు పరిశీలించారు. ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి, ఆర్డీఓ మాధవి, గ్రౌండ్ వాటర్ ఏడీ దివ్యజ్యోతి, డీటీడీఓ ఫిరంగి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు వెంకటేష్, జగన్, డీఆర్‌డీఓ చిన్న ఓబులేష్, మిషన్ భగీరథ డీఈ హేమలత, ఐటీడీఏ ఏఓ జాఫర్ ఉసేన్, ఆర్‌అండ్‌బీ డీఈ జలంధర్, తహసీల్దార్ శైలేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.