
టీనేజ్ ప్రేమలు
ఆన్‌లైన్ వేదికలు..
సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు
● మైనర్ ఏజ్‌లోనే పెళ్లిళ్లు
చేసుకుంటున్న వైనం
● ఆన్‌లైన్, మొబైల్ వినియోగంపై
అప్రమత్తంగా ఉండాలంటున్న
చైల్డ్ సేఫ్టీ అధికారులు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
పెరుగుతున్న ఘటనలు
‘నాగర్‌కర్నూల్ జిల్లాలోని మైనర్ బాలికకు
ఓ యువకుడు ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా చాటింగ్ చేసిన తర్వాత తరచుగా కలుసుకునేవాళ్లు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు
ఆ బాలిక మైనర్‌గా ఉండగానే వివాహం
జరిపించారు. ఆన్‌లైన్ పరిచయాలు ప్రేమగా మారుతుండటం, మైనర్ ప్రేమల నేపథ్యంలో మైనర్ వివాహాలు చోటుచేసుకుంటున్న
ఘటనలు పెరుగుతున్నాయి.’
సాక్షి, నాగర్‌కర్నూల్: ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, స్నాప్ చాట్, వాట్సప్.. తదితర సామాజిక మాధ్యమాల్లో నిత్యం గంటల తరబడి గడపడం ప్రస్తుతం టీనేజర్లకు సాధారణంగా మారింది. ఇదే క్రమంలో ఆన్‌లైన్ వేదికల ద్వారా కొత్తగా పరిచయం అయిన వారి పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరిలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. బాల్య దశలోనే ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోవడం, మైనర్ ఏజ్‌లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చాలావరకు ఘటనలు సంబంధిత అధికారుల దృష్టికి సైతం రావడం లేదు. తీరా మైనర్‌గా ఉన్న బాలికలకు వివాహతంతు పూర్తయ్యాక అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి.