
‘రక్తదానంతో ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి’
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతిఒక్కరూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలు నిలుస్తాయని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు అన్నారు. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జనరల్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్– పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ప్రస్తుత పరిస్థితులను అనుసరించి రక్త నిల్వలను అధిక మొత్తంలో సేకరించి ఉంచాలన్నారు. అవసరమైతే సైనికులకు పంపిస్తామని, జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిరోజు జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసి వారికి తోడ్పాటు కావాలని కోరారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జనరల్ ఆస్పత్రిలో ప్రసవాలకు వచ్చిన గర్భిణులు, ఆర్థోపెడిక్, సాధారణ శస్త్రచికిత్స రోగులకు నిత్యం పాజిటివ్ గ్రూపులతోపాటు నెగెటివ్ గ్రూప్ నిల్వలు కూడా అందుబాటులో ఉంచి ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రక్తనిధి సేకరణ నర్సింగ్ సిబ్బందితో చేపడుతున్నట్లు జిల్లా నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిదేవి తెలిపారు. కార్యదర్శి ఆనంద్, జోన్ సెవన్ ప్రెసిడెంట్ మన్మోహన్‌రెడ్డి, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ హన్మంతరావు, ప్రశాంత్, అజీమ్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రోహిత్, అనిత, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.