సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామీణ రైతులకు సహకార సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న సంఘాల పునర్వ్యవస్థీకరణకూ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి వరంగల్‌లో కొత్తగా 27 సంఘాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 70 సంఘాలకు ఇవి తోడైతే మొత్తం సంఖ్య 97కు చేరనుంది. దీంతో పంట రుణాలు, ధాన్యం కొనుగోలు వంటి సేవలు రైతులకు మరింత చేరువ కానున్నాయి.
కొత్త మండలాలకు ఊరట..
జిల్లాల పునర్విభజనతో కొత్త మండలాలు ఏర్పడినా.. వాటిలో చాలాచోట్ల సహకార సంఘాలు అందుబాటులో లేవు. కొన్ని సంఘాల పరిధిలో 20 నుంచి 30 గ్రామాలు ఉండటంతో రైతులు సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం కొత్త సంఘాల ఏర్పాటుతో పాటు పాత సంఘాల పరిధిని కూడా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది.
మారుమూల రైతులకు మేలు..
ఇంకా పూర్తి కావాల్సిన ప్రక్రియ..
కొత్త సంఘాల ఏర్పాటుతో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 8, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ఐదేసి చొప్పున మొత్తం 18 సంఘాలు రానున్నాయి. దీంతో మారుమూల గ్రామాల రైతులకు పంట రుణాలు, ఎరువులు, విత్తనాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులోనూ స్థానికంగా సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా వ్యవసాయ, సహకార శాఖ మెమో నంబర్ 8983/సీవోవోపీ–2/1/2024 ప్రకారం ఇటీవలే ఈ నిర్ణయానికి ప్రభుత్వం ఆమో దం తెలిపింది. తెలంగాణ సహకార సంఘాల చట్టం–1964లోని నిబంధనల ప్రకారం గ్రామాల విభజన, సంఘాల పరిధుల ఖరారు, ఆస్తులు, అప్పుల సర్దుబాటు వంటి ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉందని, అనంతరం తుది ఉత్తర్వులు జారీ కానున్నాయని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ జిల్లా సహకార అధికారి (డీసీఓ)తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయి సంఘాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు త్వరలోనే స్థానికంగానే సహకార సేవలు అందనున్నాయన్నారు.
జిల్లాల వారీగా కొత్త సంఘాలు
హనుమకొండ (3): నడికూడ, దామెర, వేలేరు
వరంగల్ (4): పోతిరెడ్డిపల్లి, బుధరావుపేట, రేలకుంట, చంద్రుగొండ
జేఎస్ భూపాలపల్లి (8): దామెరకుంట, పంబాపూర్, మొట్లపల్లి, పలిమెల,
టేకుమట్ల, కొత్తపల్లిగోరి, కొయ్యూరు, బొర్లగూడెం
మహబూబాబాద్ (5): ముల్కనూరు, కంబాలపల్లి, పెద్దవంగర, దంతాలపల్లి, గంగారం
ములుగు (5): కాశీందేవిపేట, రాజుపేట, కాటాపూర్, మల్లంపల్లి, కన్నాయిగూడెం
జనగామ (2): చిల్పూరు, తరిగొప్పుల
ఉమ్మడి వరంగల్‌కు కొత్తగా 27 పీఏసీఎస్‌లు
ప్రస్తుతం 70..
కొత్తవాటితో 97కు చేరనున్న సంఖ్య
భూపాలపల్లికి అత్యధికంగా 8.. ములుగు, మహబూబాబాద్‌కు ఐదేసి
హనుమకొండకు 3, వరంగల్‌కు 4


