ఏటూరునాగారం: యువతకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను పీఓ గురువారం తనిఖీ చేశారు. పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సై అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం నాలుగు స్కిల్ ట్రైనింగ్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న శిబిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజన, గ్రామీణ ప్రాంతాల యువతకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో పీఓ ముఖాముఖి నిర్వహించారు. వారి పరీక్షల సన్నద్ధత, శిక్షణ విధానం, చదువులో పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను అభ్యర్థులకు అందజేసినట్లు వెల్లడించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం అవసరమని పీఓ సూచించారు. అనంతరం వైటీసీలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పీఓ పరిశీలించారు. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సీఆర్‌ఎం, బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులకు సంబంధించిన శిక్షణ తరగతులను సందర్శించారు. శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో మాట్లాడి సూచనలు చేశారు.
గడువులోగా పనులు పూర్తిచేయాలి
మంగపేట: పుష్కరఘాట్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పొదుమూరు గోదావరి నది ఒడ్డున చేపట్టిన పుష్కరఘాట్ నిర్మాణ పనులను పీఓ గురువారం పరిశీలించారు. అలాగే గంపోనిగూడెం సమీపంలోని దొంగల ఒర్రె వద్ద 62 మీటర్ల పుష్కరఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ 6.45 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అదే ప్రాంతంలో 2015లో నిర్మించిన పుష్కరఘాట్ గోదావరి వరద కోతకు ధ్వంసమైన విషయం తెలిసిందేనని వివరించారు. అదే ప్రాంతంలో 62 మీటర్ల నూతన పుష్కరఘాట్ నిర్మాణం, ధ్వంసమైన పుష్కరఘాట్ మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయన్నారు. పనుల్లో నాణ్య తా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో


