ములుగు రూరల్: మున్సిపాలిటీ పరిధిలో అడ్డగోలుగా పెంచిన పన్నులకు నిరసనగా రేపు(20న) బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ములుగు పట్టణ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పెంచిన ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమానికి ములుగు పట్టణ ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, జవహర్‌లాల్, రమేశ్, రవీంద్రచారి, శోభన్, నాగరాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
108 వాహనం మంజూరు
చేయాలని వినతి
ములుగురూరల్: మల్లంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు 108 వాహనాన్ని మంజూరు చేయాలని కోరుతూ మంత్రి సీతక్కకు బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 108 వాహనం మంజూరుతో పాటు మల్లంపల్లిని కురువు మండలంగా ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. అలాగే అక్రమణకు గురైన పంచాయతీ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్, సర్పంచ్ ఆకుల మల్లేశ్, సంతోష్, మొర్రిరాజు, మహ్మద్ పాషా, రంజాన్, శంకర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
మువీన్‌కు డ్రోన్
ఆపరేటింగ్‌పై ట్రైనింగ్
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఆర్‌ఐటీఐ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లోని అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ మువీన్‌కు హైదరాబాద్‌లోని రామాంతపురంలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో డ్రోన్ ఆపరేటింగ్‌పై పది రోజుల పాటు ట్రైనింగ్ పొందుతున్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 9న శిక్షణకు హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీతో శిక్షణ ముగియనుంది. ప్రభుత్వం త్వరలోనే ఏటీసీ సెంటర్లకు ప్రత్యేకమైన డ్రోన్లను అందజేసి యువతీ యువకులకు ట్రైనింగ్ ఇప్పించనుందని అధికారులు తెలిపారు.
కాజీపేట సబ్ డివిజన్ ఏర్పాటుకు సిద్ధం
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని డిసెంబర్ 1వ తేదీన ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే కాజీపేట సబ్ డివిజన్ పరిధి, విస్తరణ, కార్యాలయాలు, సిబ్బంది, అధికారులు, రైళ్ల సంఖ్య, ప్రయాణికుల సంఖ్య, రైల్వేస్టేషన్ల వివరాలను, రైల్వే పోలీస్‌స్టేషన్ల కార్యకలాపాలను పాలనాపరంగా వివరాలు రైల్వే శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదట సబ్ డివిజన్ తర్వాత రైల్వే డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కన్నారు. నాందేడ్, గుంతకల్ డివిజన్లు కూడా గతంలో ఇలా.. ఏర్పాటు చేసిన తర్వాతే అప్‌గ్రేడ్ చేసినట్లు, అదే తరహాలో కాజీపేటనుకు అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీన సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేటివ్‌ను కొనసాగించే అవకాశం ఉందని, త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
బుగులోని సందర్శించిన సీసీఎఫ్ ప్రభాకర్
రేగొండ: బుగులోని వెంకటేశ్వరస్వామిని కాళేశ్వరం సీసీఎఫ్ ప్రభాకర్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 23నుంచి 27వరకు జరిగే జాతర బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఆయన వెంట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గౌతమి, బీట్ ఆఫీసర్ వెంకటేష్, జాతర చైర్మన్ గంగుల రమణారెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.


