● పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు రూరల్: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు మల్లంపల్లి మండల కేంద్రంలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి బుధవారం హాజరై మండలంలోని 10 పంచాయతీల్లో 215 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 4.60లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులతో పాటు తలసేమియా బాధితులకు సైతం పింఛన్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి ఆర్థికంగా ఎదిగేలా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని వివరించారు. అర్హత ఉండి ఇప్పటి వరకు ఇళ్లు మంజూరు కానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.


