ములుగు: యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు, ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ యువజనోత్సవం–2026 విజయవంతంగా ముగిసిందని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ.ధర్మానాయక్ తెలిపారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి జాతీయ యువజనోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన 150 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలోని సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడమే జాతీయ యువజనోత్సవాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. జిల్లా స్థాయిలో జానపద నృత్యాలు, గీతాలు, చిత్రలేఖనం, కవితా రచన, వీధి నాటకాలు తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు వివరించారు. ఈ పోటీల కోసం 18 మంది న్యాయనిర్ణేతలను ఆహ్వానించినట్లు తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసి అభినందించినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులను తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు వివరించారు. యువత తమలోని ప్రతిభను నిరంతరం మెరుగుపర్చుకుంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ధర్మానాయక్ ఆకాంక్షించారు.
విజేతల వివరాలు..
జానపద నృత్యాల విభాగంలో ములుగు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల పాఠశాల ప్రథమ స్థానం సాధించగా, జానపద గీతాల విభాగంలో బండారుపల్లి టీజీఎంఎస్ ప్రథమ స్థానంలో నిలిచింది. చిత్రలేఖనంలో జాకారం టీజీఎస్ ప్రథమ స్థానంంలో నిలవగా బండారుపల్లి టీజీఆర్‌ఎస్ ద్వితీయ స్థానంలో నిలిచింది. కవితా రచన విభాగంలో వెంకటాపూర్ టీజీఎంఆర్‌జేసీ ప్రథమ స్థానం, బండారుపల్లి టీజీఆర్‌ఎస్‌జేసీ ద్వితీయ స్థానం సాధించాయి. వీధి నాటకాల విభాగంలో ములుగు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది.
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధర్మానాయక్


