‘ఇందిరమ్మ’ బీమా భరోసా | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ బీమా భరోసా

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

● ప్రతీ కుటుంబానికి

రూ.5 లక్షల ప్రయోజనం

● కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

ములుగు: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనాలు అర్హులైన ప్రతీ కుటుంబానికి అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో అధికారులతో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. రేపటి నుంచి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో నమోదు శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న కుటుంబ సభ్యుల్లో ఒకరికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 18 నాటికి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రేషన్‌ కార్డుల ఆధారంగా అర్హులను గుర్తించి నమోదు చేయాలని సూచించారు. నామిని వివరాల నమోదులో తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. ఆధార్‌ ఓటీపీ, అవసరమైన చోట బయోమెట్రిక్‌ ధ్రువీకరణ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ఏ కుటుంబం పథకానికి దూరం కాకుండా గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం ఈ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ దేవేందర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, దరఖాస్తుల నమోదు విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌, సంపత్‌ రావు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌ తదితరులు పాల్గొన్నారు.

చిత్తడి నేలల సర్వేలో వేగం పెంచాలి

జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలకు సంబంధించిన చెరువుల సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియను వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ మంగళవారం జిల్లా అటవీశాఖ అధికారి వికాస్‌మీనాతో కలిసి చిత్తడి నేలల సర్వే ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన చెరువులకు సంబంధించిన సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. చెరువుల పరిధిని గుర్తించి, హద్దులను నిర్ధారించి సరిహద్దు గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం ఎఫ్‌ఆర్‌ఎల్‌, గరిష్ట వరద నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకొని హద్దులను నిర్ధారించాలని తెలిపారు. రెవెన్యూ, అటవీ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో వారం రోజుల్లో సాధ్యమైనన్ని చెరువుల సర్వేలను పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement