రూ.40 నుంచి రూ.85కు చేరిన కిలో ధర | - | Sakshi
Sakshi News home page

రూ.40 నుంచి రూ.85కు చేరిన కిలో ధర

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి

గోవిందరావుపేట: పేదవాడి కంచంలో అన్నం మెతుకులు తగ్గుతున్నాయి. వ్యాపారుల జేబుల్లో మాత్రం లాభాలు పెరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు కిలో రూ.40 ఉన్న బియ్యం ధర ప్రస్తుతం రూ.80 నుంచి రూ.85కు చేరడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి. రెండు నెలల్లోనే కిలోపై రూ.45 పెరగడంతో 25 కిలోల బస్తాపై అదనంగా రూ.1,125 భారం పడుతుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న కుటుంబాలకు బియ్యం ధరల పెరుగుదల గుదిబండగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఏడాది వర్షాలు తగ్గి పంట దిగుబడులు పడిపోతాయనే భయాన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భవిష్యత్‌లో కొరత వస్తుందనే పేరుతో ముందుగానే ధాన్యం, బియ్యం కొనుగోలు చేసి వేల క్వింటాళ్లలో నిల్వలు చేసుకుంటున్నారని, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని బియ్యం షాపులు, దుకాణదారులు, రైస్‌ డిపోల వ్యాపారులు వారి చేతుల్లోనే ధరల నిర్ణయం ఉండేలా సిండికేటుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ధాన్యం పండించే జిల్లాలోనే ధరల మంట

వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2026–27 వానాకాలంలో జిల్లాలో 57,704.49 ఎకరాల్లో వరి సాగు జరిగింది. దీని ద్వారా 13,27,203 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలో 51 రైస్‌ మిల్లులు ఉండగా.. 2,94,671 మంది జనాభా, సుమారు 80 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంతటి ధాన్యం ఉత్పత్తి, మిల్లింగ్‌ వ్యవస్థ ఉన్న జి ల్లాలోనే బియ్యం ధరలు ఆకాశాన్నంటడం విస్మ యం కలిగిస్తోంది. ధాన్యం కొనుగోలు చేసే టప్పుడు రైతుకు ధర తగ్గించి చెప్పే వ్యాపారులు.. అదే ధాన్యాన్ని బియ్యంగా మార్చి కిలోకు రూ.85 వరకు విక్రయించడం వెనుక ఉన్న లెక్కలేంటి, మి ల్లింగ్‌, రవాణా, నిల్వ ఖర్చులు ఉన్నాయన్నది నిజమే అయినా వాటి పేరుతో ఇంత భారీగా ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం, ధాన్యం పండించిన రైతుకు ఆశించిన లాభం దక్కడం లేదు.. బియ్యం కొనుగోలు చేసే వినియోగదారుడికి ధరల మోత తప్పడం లేదు. మరి మధ్యలో లాభపడుతున్నదెవరు? ఎల్‌నినో భయంతో ముందస్తు నిల్వలు చేస్తున్న వ్యాపారులు.. రేపటి కరువు భయాన్ని నేటి లాభాలుగా మార్చుకుంటున్నారా? జిల్లాలోని 51 రైస్‌ మిల్లులు, గోదాములు, బియ్యం దుకాణాల్లో వాస్తవంగా ఎంత నిల్వ ఉందో అధికారులు లెక్కలు తేల్చాలి. వేల క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉన్నాయన్న ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎల్‌నినో భయంతో ముందస్తు నిల్వలు

ధరల భారంతో మధ్యతరగతి

కుటుంబాల విలవిల

మార్కెట్‌లో కృత్రిమ కొరత

సిండికేట్‌గా మారి

రేట్లు పెంచుతున్న వ్యాపారులు?

నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్‌ అయ్యాను. నెలనెలా వచ్చే పెన్షన్‌తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. గతంలో కిలో బియ్యం రూ.40కి దొరికేది. ఇప్పుడు అదే బియ్యం రూ.85 అంటున్నారు. నిత్యావసరాలు ధరలు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం మాత్రం పెరగడం లేదు. ముఖ్యంగా పెన్షన్‌పై ఆధారపడే వృద్ధులు, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ధరల పెరుగుదల చాలా భారంగా మారింది. సామాన్యుడికి అందుబాటులో బియ్యం ధరలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– చాగర్ల ఐలయ్య, రిటైర్డ్‌ టీచర్‌, చల్వాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement