వెంకటాపురం
(ఎం): మండల పరిధిలోని గొలుసుకట్టు చెరువులకు దేవాదుల నీరు అందించకపోతే రైతు ఉద్యమాలు తప్పవని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. మండల పరిధిలోని మల్లయ్యపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి నీరు మండలంలోని అన్ని గ్రామాలకు అందించకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీగా, అంతకుముందు ప్రొఫెసర్‌గా ఉన్నప్పటి నుంచి నిరంతరం కృషి చేశానని తెలిపారు. చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు విషయంలో లోక్‌సభలో మూడుసార్లు ప్రస్తావించి తనవంతు కృషి చేశానని తెలిపారు. అలాగే ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకుతో పాటు లక్నవరంలో రూ. కోటితో జింకల పార్కు, ఏటూరునాగారంలో చిల్డ్రన్ పార్కుతో పాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టానని వివరించారు.
యువమోర్చా జిల్లా
ఉపాధ్యక్షుడిగా మమన్ యాదవ్
ములుగు రూరల్: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ములుగు మండలం కాశిందేవిపేట గ్రామానికి చెందిన మేడుదుల మమన్ యాదవ్‌ను నియమించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు బలరాం, ప్రధాన కార్యదర్శి నగరపు రమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవహర్‌లాల్, సీనియర్ నాయకులు భాస్కర్‌రెడ్డి, రాకేశ్‌యాదవ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని
విరమించుకోవాలి
ములుగురూరల్: సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 9 నెలల అల్పాహార బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన రూ.10వేల వేతనం, వంట కార్మికులను తొలగించకుండా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, నర్సయ్య, ప్రమీల, భారతి, సమ్మక్క, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ అరుదైన ఘనత
భూపాలపల్లి అర్బన్: విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు చేపట్టిన స్కాడా అనుసంధాన ప్రక్రియలో భూపాలపల్లి విద్యుత్ శాఖ అరుదైన ఘనత సాధించినట్లు ఎస్‌ఈ నాగెళ్లి సదానందం తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి సబ్‌స్టేషన్ (ఆర్‌ఎఫ్–డీఎఎస్)ను స్కాడా వ్యవస్థకు అనుసంధానం చేయడంతో భూపాలపల్లి ఎంఆర్‌టీ అండ్ కన్‌స్ట్రక్షన్ డివిజన్ పరిధిలో వందశాతం అనుసంధానం పూర్తయినట్లు తెలిపారు. భూపాలపల్లి సర్కిల్‌లోని 49, ములుగు సర్కిల్‌లోని 35 సబ్‌స్టేషన్లు కలిపి మొత్తం 84 సబ్‌స్టేషన్లలో స్కాడా ఇంటిగ్రేషన్ విజయవంతంగా పూర్తయినట్లు వెల్లడించారు. ఈ ఘనత సాధించడంలో అధికారులు, సిబ్బంది సమష్టి కృషి కీలకమన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎస్‌ఈ నాగేల్లి సదానందం, ములుగు ఎస్‌ఈ భిక్షపతిలు భూపాలపల్లి డీఈలు పాపిరెడ్డి, జగదీష్, ఏటూరునాగారం, ములుగు, కాటారం డీఈలు, ఏడీఈలు, ఏఈలు, కన్‌స్ట్రక్షన్, ప్రొటెక్షన్, ఓఅండ్‌ఎం విభాగాల అధికారులు, సిబ్బందిని అభినందించారు.


