జిల్లాలోని మండలాల వారీగా వరిసాగు వివరాలు (ఎకరాల్లో)
జిల్లాలో కోత దశకు వచ్చిన వరిపంట
ములుగు: ఓ వైపు చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట.. మరోవైపు తుపాను హెచ్చరికలు.. వెరసి జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలతో అన్నదాతల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే వరికోత దశకు చేరుకోవడంతో వర్షాలు, ఈదురుగాలులు తమ పంటను ఎక్కడ దెబ్బతీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటపై భారీ వర్షాలు పడితే ధాన్యం నేలరాలడం, పంట నేలకొరగడం, కోసిన ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
కోత దశలో వరిపంట..
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 94,160 ఎకరాల్లో వరిపంటను రైతులు సాగుచేశారు. ఇప్పటికే జిల్లాలో 10 వేల ఎకరాలకు పైగా నీటి వసతి లేని పంటలు ఎండిపోగా మిగిలిన వరి పంట కోత దశకు చేరుకుంది. కొన్నిచోట్ల పంట కోతకు సిద్ధంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో కోత పనులను ప్రారంభించారు. ఈ తరుణంలో తుపాన్ ప్రభావంతో వర్షాలు కురిసి, బలమైన గాలులు వీస్తే పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు భావిస్తున్నారు. వరి కోత సమయంలో వర్షాలు పడితే పొలాల్లో నీరు నిలిచి కోత పనులకు ఆటంకం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. ధాన్యం తడిసిపోతే ఆరబెట్టడం, నిల్వ చేయడం, విక్రయానికి తరలించడం వంటి పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని, ఈదురుగాలులకు వరిపంట నేలకొరిగితే ధాన్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చల్లబడిన వాతావరణం
అర్నబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావారణశాఖ సూచనలతో రైతులు అప్రమత్తమవుతున్నారు. ఈ మేరకు తుపానున్‌ప్రభావంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు వర్ష సూచనలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. పొలాల్లో ఉన్న పంటను కాపాడుకోవడంతో పాటు కోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. కోసిన ధాన్యాన్ని వీలైనంత త్వరగా సురక్షిత ప్రదేశాలకు తరలించడం, వర్షం నుంచి రక్షణ కల్పించడం, పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని భావిస్తున్నారు. గతేడాది అక్టోబరు చివర్లో మొంథా తుపాను ప్రభావం గురించి రైతులు చర్చించుకుంటున్నారు. ఈ సారి అర్నబ్ తుపాను ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అయోమయానికి గురవుతున్నారు. ఈ మేరకు రైతులు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని వ్యవసాయ శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. తుపాన్ తీవ్రత, వర్షపాతం వివరాలపై అధికారిక ప్రకటనలను అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.
పంట పొలంలోనే ఆరబోసిన ధాన్యం
వెంకటాపురం(ఎం)లో కోతకు వచ్చిన వరిపంట
ములుగు 9,558
మల్లంపల్లి 5,900
వెంకటాపురం(ఎం) 19,741
గోవిందరావుపేట 11,000
మంగపేట 21,900
ఏటూరునాగారం 10,842
ఎస్‌ఎస్‌తాడ్వాయి 3,000
వెంకటాపురం(కె) 5,300
వాజేడు 4,700
కన్నాయిగూడెం 2,219
నేడు, రేపు భారీ వర్షాలు కురిసే
అవకాశం
అన్నదాతల్లో టెన్షన్


