● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు
అర్నబ్ తుపాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. జిల్లా, మండల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. నేటి నుంచి 29 ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వివరించారు. రాబోయే మూడు రోజులు అధికారులు మండలాల్లోనే అందుబాటులో ఉండాలని, రాత్రి వేళల్లో సహాయక చర్యల కోసం సీనియర్ అధికారులను నియమించాలని సూచించారు. రైతులను అప్రమత్తం చేసి పంటల రక్షణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. వరద ముప్పు ప్రాంతాల్లో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది 24 గంటటు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జంపన్నవాగు, దయ్యాలవాగు, జీడివాగు, గుండ్లవాగు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. గోదావరి వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఏటూరునాగారానికి చేరుకుందని వెల్లడించారు. ప్రజలు వాగులు దాటవద్దని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండకుండా పక్కా భవనాల్లో ఆశ్రయం పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు పాల్గొన్నారు.


