ములుగు: ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ విభాగాల అధికారులతో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో సన్నద్ధత, తాగునీటి వసతులు, జలసిరి పనులు, ఉపాధి కూలీల హాజరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పనిదినాల కల్పన తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఆవాసాల్లో తాగునీటి సరఫరా మౌలిక వసతులపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రిడ్ ద్వారా ఆవాసాలు, పట్టణ ప్రాంతాలకు అందుతున్న శుద్ధి చేసిన నీటి సరఫరాతో పాటు గ్రామాల్లో ఇంటింటికీ నీటి సరఫరా తీరును పరిశీలించాలని ఆదేశించారు. చేతిపంపులు, సింగిల్, త్రీ ఫేజ్ మోటార్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని సూచించారు. ఓవర్‌హెడ్ నీటి ట్యాంకులను నిర్ణీత తేదీల్లో శుభ్రపర్చడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. అ లాగే ట్యాంకుల మూతలు, కీటకాలు ప్రవేశించకుండా ఉండేలా మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రతి ఇంటి నల్లా కనెక్షన్ పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు నీటి ట్యాంకర్లను సిద్ధంగా ఉంచడంతో పాటు నిర్వహణ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. పెండింగ్ సమస్యలను అవసరానికి అనుగుణంగా మండల, జిల్లా స్థాయి సమావేశాల్లో పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీఆర్‌డీఓ రవీందర్, డీపీఓ వెంకయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ సునీత, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖల ఈ ఈలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
ములుగు రూరల్: క్రీడల్లో గెలుపోటములు సహజమని కలెక్టర్ హేమంత్ సహదేవరావు అన్నారు. మండల పరిధిలోని జాకారం గురుకుల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి పీఎంశ్రీ క్రీడాపోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీల్లో ఓడిపోయినంత మాత్రన బాధపడాల్సిన అవసరం లేదన్నారు. లోపాలను సరిదిద్దుకుని పట్టుదలతో సాధన చేయాలని కోరారు. విద్యార్దులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకుని రాష్ట్ర స్థాయిలో రాణించాలని సూచించారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


