ఫీజుల దోపిడీకి చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఫీజుల దోపిడీకి చెక్‌

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

గోవిందరావుపేట: ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ ప్రత్యేక పోర్టల్‌ పీఎస్‌సీఎంఎస్‌(ప్రైవేట్‌ స్కూల్‌ కంప్‌లైంట్‌ మానిటరింగ్‌ సిస్టం)ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అధిక ఫీజులు, వివిధ రకాల అదనపు వసూళ్లపై ఇక నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. దీంతో అధిక ఫీజుల భారం నుంచి బయటపడే అవకాశం ఉంది.

అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేలా..

జిల్లా వ్యాప్తంగా 41 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 11,335 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ట్యూషన్‌ ఫీజుతో పాటు పుస్తకాలు, యూనిఫాం, పరీక్షలు, ఇతర కార్యకలాపాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఫీజుల విషయంలో స్పష్టత లేకపోవడం, తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తారనే భయంతో చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ ద్వారా అధిక ఫీజులు, నిబంధనలకు వ్యతిరేకంగా అధికంగా వసూళ్లు చేస్తే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని విద్యాశాఖ అధికారులు కల్పించారు. దీంతో విద్యాసంస్థల ఫీజుల వసూళ్లపై మరింత పారదర్శకత, పర్యవేక్షణకు అవకాశం ఏర్పడనుంది.

అవగాహన కల్పిస్తేనే ఫలితం

వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన పోర్టల్‌పై తల్లిదండ్రుల్లో ఎంతమందికి అవగాహన ఉందన్నదే కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ ఫిర్యాదు విధానం, పోర్టల్‌ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాలల వద్ద, మండల విద్యాశాఖ కార్యాలయాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పోర్టల్‌లో నమోదయ్యే ఫిర్యాదులపై సకాలంలో విచారణ చేసి చర్యలు తీసుకుంటేనే ఈ విధానం సత్ఫలితాలనిస్తుంది. కేవలం పోర్టల్‌ ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన ప్రతీ ఫిర్యాదును పర్యవేక్షిస్తూ ప్రైవేట్‌ పాఠశాలలపై నిరంతర నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.

ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు..

తల్లిదండ్రులు తమ సమస్యను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు అవసరమైన ఆధారాలను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. సమస్యలు ఫిర్యాదులను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పోర్టల్‌లో పీఎస్‌సీఎంఎస్‌లో మొబైల్‌లో లాగిన్‌ కావచ్చు. ఓటీపీ ఆధారంగా వివరాలు నమోదు చేయాలి. అలాగే ఫిర్యాదు పరిస్థితిని ట్రాక్‌ చేసే అవకాశం ఉంటుంది. ఫీజు రశీదులు, పాఠశాల నుంచి వచ్చిన సందేహాలు, పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలని ఇచ్చిన సూచనలు తదితర ఆధారాలను ఫిర్యాదుతో జత చేయవచ్చు. ఫిర్యాదు అందిన అనంతరం సంబంధిత అధికారులు అంశాన్ని పరిశీలించి అవసరమైతే పాఠశాల యాజమాన్యం నుంచి వివరణ అడుగుతారు. తదనుగుణంగా చర్యలు చేపడతారు.

ప్రైవేట్‌ పాఠశాలల అధిక ఫీజుల

వసూళ్లకు అడ్డుకట్ట

ప్రత్యేక పోర్టల్‌ తీసుకొచ్చిన విద్యాశాఖ

విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం

పోర్టల్‌పై విస్తృత అవగాహన

కల్పిస్తేనే ప్రయోజనం

నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే చర్యలు

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలను వారికి స్పష్టంగా తెలియజేస్తాం. నిబంధనలకు మించి అధిక ఫీజులు వసూలు చేసినట్లు తేలితే సంబంధిత పాఠశాలలపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక ఫీజుల విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికావాల్సిన అవసరం లేదు. పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేసినా, ఇబ్బందులకు గురి చేసినా ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయవచ్చు. అందిన ఫిర్యాదులను పరిశీలించి, వాస్తవాలు నిర్ధారణ అయితే సంబంధిత పాఠశాల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటాం.

– సిద్ధార్థరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement