హేమాచల క్షేత్రం అభివృద్ధిపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

హేమాచల క్షేత్రం అభివృద్ధిపై సమీక్ష

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, సంబంధిత అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌లోని సచివాలయంలో శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దేవాలయ ప్రస్తుత పరిస్థితి, భక్తుల రాకపోకలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భవిష్యత్‌ అవసరాలు తదితర అంశాలపై దేవాదాయశాఖ అధికారులు, ఆర్కిటెక్టర్లతో విస్తృతంగా చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్ప న, క్షేత్ర ప్రాశస్త్యం, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. కల్యాణ మండపం, అన్నదాన సత్రం, డార్మెంటరీతో పాటు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంపై చర్చించి వాటి పనులను చేపట్టాలని నిర్ణయించారు. అదేవిదంగా దేవాలయ ప్రధాన నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా క్షేత్ర పవిత్రతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయ నిర్మాణ స్వరూపం, పరిసర ప్రాంతాల ప్రత్యేకత, భక్తుల అవసరాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆర్కెటెక్టులు, అధికారులను ఆదేశించారు.

డిజైన్‌ ఖరారుకు ఆలయ పరిశీలన

అభివృద్ధి పనులకు సంబంధించిన డిజైన్‌ను ఖరారు చేసేందుకు త్వరలో ఆలయాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం దేవాలయ అభివృద్ధికి అనువైన డిజైన్‌ను ఖరారు చేయనున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించి భూమి స్థితిగతులు, నిర్మాణ సామర్ధ్యం తదితర అంశాలను నిర్ధారించేందుకు రాక్‌టెస్ట్‌ను త్వరితగతిన చేపట్టాలని ఖరారు చేశారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి నిర్మాణ పనులకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఖరారు చేయనున్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన హేమాచల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. అభివృద్ధి పనులు, నాణ్యతా ప్రమాణాలు, సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.

పనుల డిజైన్‌ ఖరారుపై

మంత్రి సీతక్క ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement