ములుగు: అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18లో ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవాలని, తెలంగాణ శాసనమండలిలోని పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితా పునఃసిద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం వివరాలను వెల్లడించారు. అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలతో జాబితాను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కనీసం మూడేళ్లు పూర్తవ్వాలని తెలిపారు. సాధారణ శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లాగా ఈ ఓటర్ల జాబితా శాశ్వతం కాదని తతెలిపారు. గతంలో ఓటు హక్కు ఉన్నవారైనా తప్పనిసరిగా కొత్తగా ఫారం–18 ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అర్హులు ఎన్నికల ప్రధాన అధికారిక వెబ్‌సైట్ ceotelangana. nic. in ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ప్రతీ పట్టభద్రుడు నిర్ణీత గడువులోగా ఫారం–18 సమర్పించాలని కోరారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ తెలిపారు.
బండారుపల్లి మోడల్‌స్కూల్‌కు హరియాణా రాష్ట్ర ప్రతినిధులు
ములుగు రూరల్: బండారుపల్లి మోడల్ స్కూల్‌ను శనివారం ఏక్ భారత్ పోగ్రామ్‌లో భాగంగా హరియాణా రాష్ట్ర ప్రతినిధులు ప్రోమిలా, ప్రితి పన్వార్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా హరియాణా రాష్ట్ర మాతృభాషా, వారి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, రాష్ట్ర గొప్పతనం గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు శాసీ్త్రయ సంగీతంపై వివరంచారు. ఈ సందర్భంగా పీఎం శ్రీ స్కీమ్‌లో భాగంగా పాఠశాలల్లో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి పాఠశాల ప్రిన్సిపాల్ సింగారం దేవకిని అడిగి తెలుసుకున్నారు.
ప్రజావాణికి
మూడంచెల విధానం
ములుగు: ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రజావాణిని మూడు అంచెల విధానంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టరేట్ కార్యాలయ అధికారి మంజుల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలోనే పరిష్కరించగల సమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు రావడం వల్ల సమయం, ప్రయాణ ఖర్చులు వృథా అవుతున్నాయని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో స్వీకరించిన దరఖాస్తులను తిరిగి క్షేత్రస్థాయి అధికారులకు పంపాల్సి రావడంతో పరిష్కారంలో జాప్యం అవుతుందని వివరించారు. మొదటి దశలో మండల స్థాయి ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను సమర్పించాలని తెలిపారు. రెవెన్యూ రికార్డులు, రేషన్ కార్డులు, తదితర సమస్యలపై ప్రతీ సోమవారం తహసీల్దార్ లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. రెండో దశలో డివిజన్ స్థాయి ప్రజావాణిని ఆశ్రయించాలని వెల్లడించారు. అక్కడా పరిష్కారం కాకపోతే మూడో దశలో జిల్లా స్థాయి ప్రజావాణి ఉంటుందని మంజుల వివరించారు.
అక్టోబర్ 4న
రెడ్‌క్రాస్ ఎన్నికలు
ఏటూరునాగారం: అక్టోబర్ 4న జిల్లాలో రెడ్‌క్రాస్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికల నోటీస్ అధికారి ఎ.ధర్మనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు వెల్ల డించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు నిర్వహణ కమిటీ సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు. 25న నామినేషన్ల పరిశీలన, తుది జాబితా నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే నెల 4వ తేదీన ఉదయం 8 నుంచి 3 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌లో ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. నామినేషన్ వేసే వారు రూ.10 వేలు ఫీజు చెల్లించాలని వెల్లడించారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 7032153610లో సంప్రదించవచ్చు తెలిపారు.


