గోవిందరావుపేట: 50ఏళ్లు నిండిన గీత కార్మికులకు వృత్తి పింఛన్లు మంజూరు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం రిటైర్డ్ ఉద్యోగి కొత్తమల్లయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఏజెన్సీ పేరుతో 2001లో జిల్లాలోని 25 కల్లుగీత సొసైటీలు రద్దు కావడంతో అప్పటి నుంచి గీత కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. తాటిచెట్లపై నుంచి పడి గాయపడిన, మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు సైతం ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 350 ప్రకారం 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు వృత్తి పింఛన్లు అందాల్సి ఉన్నా ఏజెన్సీ నిబంధనల కారణంగా మంజూరు కావడం లేదన్నారు. ఇతర వృత్తుల వారికి లేని అడ్డంకులు గీత కార్మికులకు ఎందుకని ప్రశ్నించారు. కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా 50 ఏళ్లు నిండిన ప్రతీ గీత కార్మికుడుకి పింఛన్ మంజూరు చేసేలా మంత్రి సీతక్క తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘం మండల అధ్యక్షుడు మల్లేశ్, కార్యదర్శి సారయ్య, నాయకులు భిక్షం, చంద్రయ్య పాల్గొన్నారు.
సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్


