జిల్లాలో కేసుల వివరాలు
సాంకేతికతతో ఐదు నిమిషాల్లోనే ఫలితాలు
ఏటూరునాగారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నిర్ధారణకు నూతన సాంకేతిక విధానాన్ని అ మల్లోకి తీసుకువచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో కంప్యూటర్ ద్వారా ఊపిరితిత్తుల్లో ఉన్న నిమ్మును పసిగట్టి అది టీబీనా లేక ఏదైనా జబ్బు ఉందా అని కేవలం ఐదు నిమిషాల్లోనే చెబుతుంది. దీనిని అనుగుణంగా జిల్లాలోని పది మండలాల్లో విడతల వారీగా శిబిరాలను నిర్వహిస్తూ ఏఐ ద్వారా అనుమానితులను పరీక్షించి వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ విధంగా ఏడాదిలో 349 కేసులు నమోదు కావడంతో జిల్లాలో అధికారులు, ప్రజలను కలవరపెడుతుంది. ఇందులో 75 కేసులను తొలి దశలోనే గుర్తించి మందుల ద్వారా నివారించారు. మిగతా 274 కేసులు ప్రస్తుతం చికిత్సలు నడుస్తున్నాయి. ఈ కేసులు మరింత పెరిగితే ప్రమాదం ఉంటుందని నిపుణులు వాపోతున్నారు. మొదటి దశలోనే గుర్తించి వారికి సరైన పోషకాహారం, మందులను అందిస్తే నివారించే అవకాశం ఉందని వైద్యులు వాపోతున్నారు.
గుర్తించడం ఎలా?
క్షయ వ్యాధిని గుర్తించడానికి పలు కారణాలున్నాయి. రెండు వారాలకుమించి దగ్గు ఉండడం, కఫం రావడం, కొన్నిసార్లు రక్తంతో కఫం పడడం, జ్వరం రావడం, సాయంత్రం, రాత్రి వేళలో చెమటలు పట్టడం, క్రమక్రమంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, రోజురోజుకూ బలహీనంగా కనిపించే వంటి లక్షణాలు కూడా క్షయవ్యాధికి సూచనలుగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులు వెంటనే ఆస్పత్రిలో చేరితే వారికి కావాల్సిన చికిత్సలు అందించే అవకాశాలున్నాయి. కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే వంటి పరీక్షలు ద్వారా నిర్ధారణ చేస్తారు.
టీబీకి ప్రత్యేక ఆస్పత్రి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని టీబీ రోగులకు హనుమకొండలోని క్షయవ్యాధి కేంద్ర ఆస్పత్రి ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్దారణ అయిన కేసులను అక్కడికి తరలించి ఉచితంగా మందులు ఇస్తారు. అంతేకాకుండా ప్రస్తుతం సామాజిక, ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక టీబీ నివారణ విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రతీ వారం టీబీ పరీక్షలు చేసేందుకు రోగుల నుంచి కఫంను షాంపిల్స్‌ను సేకరించి వాటిని పరీక్షించి నిర్దారణ అయితే సంబంధిత రోగికి ప్రత్యేక చికిత్స అందిస్తారు. తొలి దశలో గుర్తిస్తే నివారణకు అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
మండలం కేసులు
ములుగు 52
మల్లంపల్లి 7
వెంకటాపురం(ఎం) 35
గోవిందరావుపేట 46
తాడ్వాయి 34
ఏటూరునాగారం 22
మంగపేట 53
కన్నాయిగూడెం 18
వెంకటాపురం(కె) 42
వాజేడు 40
టీబీరహిత సమాజమే లక్ష్యంగా
వైద్యఆరోగ్యశాఖ శిబిరాలు
జిల్లాలో 349 అక్టివ్ కేసులు


