చేయూత పింఛన్ల దరఖాస్తులకు నేడే చివరి రోజు
ములుగు: జిల్లాలో చేయూత పింఛన్ దరఖాస్తుదారులు ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పాలన నేపథ్యంలో చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రామ పంచాయతీల వారీగా చేయూత పింఛన్ల దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పింఛన్ దరఖాస్తులను తీసుకుంటున్నారు. మంగళవారం నాటికి 4,095 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నేడు(బుధవారం) దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు అవకాశం ఉండడంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.
వయోవృద్ధులకు మొండిచేయి..
ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించిన చేయూత పింఛన్ల మంజూరులో వయోవృద్ధులకు మొండిచేయి చూపించింది. గత ప్రభుత్వం 57 ఏళ్ల నుంచి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొందరికి మాత్రమే వయోవృద్ధుల పింఛన్లు మంజూరు చేసి మిగిలిన జాబితాను పెండింగ్‌లో పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్లు మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పింఛన్లు మంజూరు అవుతాయని వయోవృద్ధులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నామని చెబుతూ గతంలో దరఖాస్తులు చేసుకున్న వారిని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆగష్టు 31 వరకు తుది గడువు విధించినప్పటికీ ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పింఛన్ల దరఖాస్తుల గడువును పెంచింది. వరుస సెలవుల నేపథ్యంలో ఒకరోజు గడువు పెంచి 16వ తేదీ వరకు అవకాశం కల్పించింది. కాగా ప్రభుత్వం అందించే చేయూత పింఛన్ల విషయంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, డయాలసిస్, పైలేరియా రోగులకు మాత్రమే చేయూత పింఛన్లు ఇస్తామని వెల్లడిస్తూ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించడంతో వయోవృద్ధులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వయోవృద్ధులకు సైతం చేయూత పింఛన్లు మంజూరు చేయాలని వృద్ధులు కోరుతున్నారు.
జిల్లాలో 37,127 మందికి పింఛన్లు
జిల్లాలో ఇప్పటి వరకు 37,127 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఈ మేరకు 14,918 మంది వృద్ధులతో పాటుగా 16,363 మంది వితంతువులు, 3,819 మంది వికలాంగులు పింఛన్లు అందుకుంటున్నారు. అలాగే 203 మంది కల్లుగీత కార్మికులు, 217 మంది చేనేత కార్మికులు, 90 మంది బీడీ కార్మికులు, 1,517 మంది ఒంటరి మహిళలతో కలిపి మొత్తంగా 37,127 మందికి ప్రతినెలా రూ.9.01 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
జిల్లా వ్యాప్తంగా పింఛన్ల కోసం వచ్చిన
దరఖాస్తుల వివరాలు (15వ తేదీ వరకు)
ఇప్పటికే 4,095 దరఖాస్తుల రాక
వరుసగా మూడు రోజులు సెలవు
రావడంతో గడువు పెంచిన ప్రభుత్వం
ఒక్కరోజు గడువు పెంపు..
జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 171 గ్రామపంచాయతీలతో పాటు ములుగు మున్సిపాలిటీ పరిధిలో అధికారులు దరఖాస్తులను స్వీకరించగా మంగళవారం నాటికి 4,095 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులకు తుది గడువు అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మూడు రోజులు వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు ఒకరోజు గడువు పెంచి నేటి వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వితంతువులు 2,634
ఒంటరి మహిళలు 468
దివ్యాంగులు 844
గీత కార్మికులు 104
చేనేత కార్మికులు 45


