మున్సిపాలిటీకి నిధులు కేటాయించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీకి నిధులు కేటాయించాలని వినతి

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

ములుగు: నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి చింతనిప్పుల భిక్షపతి, మాజీ జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు రియాజ్‌ మీర్జా మంగళవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీ పరిధిలో మినీ ట్యాంక్‌బండ్‌, చిల్డ్రన్స్‌ పార్క్‌, నూతన మున్సిపాలిటీ భవనం, మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌, ఓపెన్‌ జిమ్‌, ఆధునిక వాహనాలు, మోడ్రన్‌ గ్రేవ్‌యార్డ్‌ తదితర మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూపొందించిన ఎస్టిమేషన్‌ కాపీని మంత్రికి అందజేశారు. ఆయా పనులకు సుమారు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

బురదలో చిక్కుకున్న 102 వాహనం

గోవిందరావుపేట: ఇటీవల రెండు రోజుల పాటు కురిసిన వర్షంతో మండల పరిధిలోని పలు రోడ్లు బురదమయంగా మారాయి. ఈ మేరకు మండల కేంద్రంలోని 4వ వార్డు గ్రంథాలయం బజారులో రహదారి పూర్తిగా బురదమయంగా మారింది. కనీసం కాలినడకన వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సోమవారం 102 అంబులెన్స్‌ వాహనం వచ్చి బురదలో కూరుకుపోయింది. చివరకు స్థానికులు ట్రాక్టర్‌ సాయంతో అంబులెన్స్‌ను బయటకు లాగాల్సి వచ్చింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

‘తండాలను జీపీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే’

ములుగు: రాష్ట్రంలో తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆమె మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10శాతం వరకు బీఆర్‌ఎస్‌ ప్రభత్వమే పెంచిందని తెలిపారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకుని నేటితో నాలుగేళ్లు పూర్తవుతున్నందున గిరిజనుల తరఫున కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆమె వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రేపు(17న) జిల్లా వ్యాప్తంగా తండాలు, గూడేల్లో కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో నాయకులు గోవింద్‌నాయక్‌, కాక లింగయ్య, రేగ నర్సయ్య, తాటి కృష్ణ, జంపన్న తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమం

గోవిందరావుపేట: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్ఫూర్తితో రైతాంగ, ప్రజా సమస్యలపై మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పస్రాలో గల సీపీఎం కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నాగరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య ముఖ్య అతిథిగా హాజరై అమరవీరులకు నివాళులర్పించి మాట్లాడారు. భూమి, భుక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందన్నారు. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, నల్ల నర్సింహులు, ఠానునాయక్‌, షేక్‌ బందగి వంటి ఎందరో వీరులు అమరులయ్యారని గుర్తు చేశారు. పోరాట ఫలితంగా సుమారు పది లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని తదితర విషయాలను కృష్ణారెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement