గోవిందరావుపేట: అడవిలో 7 కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్లి ఆదివాసీలకు వైద్యసేవలు అందించినట్లు సబ్ యూనిట్ అధికారి భూపాల్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కర్లపల్లి గుండ్లవాగు ప్రాజెక్ట్ సమీపంలోని బూడిదగడ్డగూడెంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు, పెద్దలకు వైద్యపరీక్షలు నిర్వహించి 20 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా మలేరియా లక్షణాలు కనిపించలేదని తెలిపారు. మొత్తం 50 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు వివరించారు. ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు పింగిళి నాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తగ్గడంతో ఆరా తీయగా గూడెం వాసులు జ్వరాల బారిన పడిన విషయం తెలిసిందన్నారు. ఈ విషయాన్ని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు వైద్య శిబిరాలు నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి గోపాల్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.


